Friday, April 16, 2010

చింతకాయలీడరు

మీరు "అప్పుల అప్పారావు " సినిమా చూసారా? అందులో "నాదెండ్ల అంజయ్య" గుర్తున్నాడా? డైలాగులు మక్కీకిమక్కీ  గుర్తులేవుగాని అందులో ఒక సీను మాత్రం ఇదిగో ఇలా ఉంటుంది.

(నాదెండ్ల అంజయ్య (బాబూ మోహన్) జనాన్ని వెంటేసుకొని హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంటికొస్తాడు)

హీరో: అల్లో అల్లో నాదెండ్ల అంజయ్య గారూ ఏమిటిలా జనాన్ని వెంటేసుకొచ్చారు ?
బాబూ మోహన్: నేను వెంటేసుకొని రావటం ఏమిటీ నా చింతకాయ్ (ఇది ఆయన ఊతపదం)
హీరో : మరి?
బాబూ మోహన్: (మొహం అదోలా పెట్టి) నేను వాళ్ళని వెంటేసుకు రాలేదు వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు.

ఈ మధ్య నాకు కేసీఆర్ ని చూసినప్పుడల్లా  ఈ సీనే గుర్తుకొస్తోంది .ఈయన అప్పుడపుడు స్టూడెంట్స్ ని వెనకేసుకొచ్చినా, చాలా సార్లు పాపం వాళ్ళే ఈయన్ని   ముందెట్టుకొస్తుంటారు(గతిలేక ).ఒకరోజు నెత్తి నెట్టుకుంటారు. ఆ మరుసటి రోజే  కిందకి దింపి ఆయన శవ యాత్రలూ లేదా  దిష్టిబొమ్మ దహనాలూ చేస్తుంటారు . వీలయితే  ఆయనకే "ఆల్టిమేటం" జారీ చేస్తుంటారు. రాజకీయ నాయకుల్లో అవినీతి పరుల్నీ, పదవి కోసం ఎంతకైనా తెగించే వారినీ , బంధు  ప్రీతి,కుల గజ్జి అణువణువునా జీర్ణించుకున్న వాళ్ళని చూసాం. కానీ ఈయన లాంటి ఏకకాలంలో హీరో కం జీరో   లాంటి లీడర్లు చాలా అరుదు. ఎవరు  ఎవర్ని  నడిపిస్తున్నారో కూడా అర్ధంగాని రీతిలో ఉద్యమాన్ని (?) నడపటం ఈయనకే చెల్లు. ఏమంటారు?

Sunday, March 21, 2010

ఉపోద్ఘాతం

హాయ్ ,

నా పేరు భారతీయుడు.మరీ మన కమలాసన్ అంత  కాకున్నా..కాస్తో కూస్తో ఆ టైపే. దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక జాడ్యాలు, మారుతున్న విలువలు, అపహాస్యం పాలవుతున్న ప్రజాసామ్యం వీటన్నిటి మధ్య సతమతమవుతున్న సామాన్యుడు. నా ఈ పోస్టుల్లో ఆ సామాన్యుడే హీరో.ఒక్క రాజకీయాలకే పరిమిత మవకుండా, క్రీడలు,సినిమాలు , మీడియా పోకడలు..ఇలా ప్రతిదానిమీద నాకు తోచిన విధంగా సైటైర్లు ఉంటాయి ఈ బ్లాగులో. నేను రాసేవి చదివి నా ఆలోచనలు మీతో పంచుకొని అలానే ఆయా విషయాల మీద మీ ప్రతిస్పందన తెలుసుకోవాలని నా కోరిక. ఆశీర్వదించండి ...

ఇట్లు
మీ
భారతీయుడు